అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం సినిమాలు ఫోన్లో, టీవీలో వచ్చేస్తున్నాయ్.. థియేటర్లకు జనం రావట్లేదు అనే పరిస్థితిలో.. మీరు మంచి సినిమా ఇవ్వండి, తెలుగువాళ్లం థియేటర్లకు వచ్చి చూస్తాం అని చెప్పిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మా నాన్నగారు (అల్లు అరవింద్) చిరంజీవి, రజనీకాంత్‌గార్లతో, రామ్‌చరణ్, హిందీలో ఆమిర్ ఖాన్‌లతో ఇండస్ట్రీ రికార్డ్ కొట్టారు. ఎప్పటికైనా మా నాన్నగారితో ఇండస్ట్రీ రికార్డ్ సినిమా కొట్టాలి అనుకొనేవాణ్ణి. ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కొడుతున్నా. మా నాన్నతో ఇండస్ట్రీ రికార్డ్ కొట్టడమనే ఆనందాన్ని త్రివిక్రమ్‌గారిచ్చారు’’ అన్నారు. ‘‘త్రివిక్రమ్‌గారితో పనిచేయడానికి నాకు పదేళ్లు పట్టింది. అందుకే పదేళ్లు మించిపోయే పాట ఇచ్చాను’’ అన్నారు సంగీత దర్శకుడు తమన్. ‘‘తెలుగు అభిమానుల్లా ఏ భాషలోనూ ఉండరు’’ అన్నారు పూజా హెగ్డే.
టైటిల్ ఫిక్స్ కాలేదు
‘ఆర్య, ఆర్య 2’ తర్వాత అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కలసి ఓ సినిమా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా టైటిల్ ‘సింహాచలం’ అంటూ పలు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ‘మా సినిమాకు ఇంకా ఏ టైటిల్ నిర్ణయించలేదు. ప్రచారంలో ఉన్న వార్తల్లో నిజం లేదు’ అని చిత్రబృందం ప్రకటించింది.