నువ్వు ఏ అధికారంతో అడుగుతావు?

సాక్షి, అమరావతి : అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంను ఉద్దేశించి సోమవారం శాసనసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. సభాపతిని ఏకవచనంతో సంభోదిస్తూ బెదిరింపు ధోరణిలో మాట్లాడడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. చంద్రబాబు తీరుపై మంత్రి బొత్స సత్యనారాయణతోపాటు వైఎస్సార్‌సీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అమరావతి ప్రాంతంలో టీడీపీ ప్రభుత్వంలో సాగిన భూకుంభకోణాలపై సమగ్ర విచారణ జరిపించి నిజాలు నిగ్గుతేల్చాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సూచించారు. ఇంతలో చంద్రబాబుతో సహా టీడీపీ సభ్యులు లేచి అభ్యంతరం వ్యక్తంచేశారు. చంద్రబాబు స్పీకర్‌ను ఉద్దేశిస్తూ ‘నువ్వు ఏ అధికారంతో విచారణ జరపాలని అడుగుతావు’అని గద్దిస్తున్నట్లు ప్రశ్నించారు. దీనిపై స్పీకర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.