గెలిచారు.. సిరీస్‌ను ముద్దాడారు

బెంగళూరు : మూడు వన్డేల సిరీస్‌ విజేతను డిసైడ్‌ చేసే మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. కలిసొచ్చిన మైదానంలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా ముద్దాడింది. అంతేకాకుండా కొత్త ఏడాదిలో రెండో సిరీస్‌ విజయంతో టీమిండియా తన విజయపరంపర కొనసాగించింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా నిర్దేశించిన 287 పరుగుల లక్ష్యాన్ని కోహ్లి సేన 47.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్ష్య ఛేదనలో టీమిండియా హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ(119, 128 బంతుల్లో 8ఫోర్లు, 6 సిక్సర్లు) శతక్కొట్టాడు. రోహిత్‌కు తోడు సారథి విరాట్‌ కోహ్లి (89; 91 బంతుల్లో 8ఫోర్లు) విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివర్లో శ్రేయస్‌ అయ్యర్‌ (44నాటౌట్‌, 35 బంతుల్లో 6ఫోర్లు, 1 సిక్సర్‌) బ్యాట్‌ ఝుళిపించి టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఆసీస్‌ బౌలర్లలో అగర్‌, జంపా, హజల్‌వుడ్‌లు తలో వికెట్‌ పడగొట్టారు.