రోడ్డు ప్రమాదం.. కానీ స్నేహితులే అత్యాచారం చేసి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నోయిడాకి చెందిన ఒక యువతి(20) నోయిడాలోని సెక్టార్‌ 68లోని ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తుంది. కాగా  గత శుక్రవారం ఆమె పని మీద మధురకు వెళ్లింది. తనతో పాటు ఆమె సోదరుడు(21), తన కంపెనీలోనే పనిచేసే సహచర ఉద్యోగి(22),అతని స్నేహితుడు(21)తో కలిసి రెండు ద్విచక్ర వాహనాలపై వెళ్లారు. అయితే ఆ అమ్మాయి మధుర వెళ్తున్న విషయం ఇంట్లో చెప్పలేదు. మధురలో తమ పని ముగించుకొని తిరుగు ప్రయాణంలో నోయిడాలోని నవ్‌జిల్‌ టోల్‌ప్లాజా వద్దకు రాగానే సదరు యువతి తాను వాష్‌రూమ్‌కు వెళతానని, బండి పక్కన ఆపమని తన స్నేహితునికి చెప్పింది. ఆమె రోడ్డును దాటుతుండగా ఎదురుగా వేగంగా వచ్చిన కారు ఆమెను ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో బాధితురాలిని వెంటనే దగ్గర్లోని కైలాష్‌ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స నిర్వహించారు. అక్కడి నుంచి ఢిల్లీలోని గురుతేజ్‌ బహుదూర్‌ ఆసుపత్రికి తరలించారు. కాగా సదరు యువతి చికిత్స పొందుతూ ఆదివారం మరణించిదని పేర్కొన్నారు.


ఈ నేపథ్యంలో బాధితురాలి కుటుంబసభ్యులు శనివారం పోలీసులను కలిసి తమ కూతరుకు జరిగిన ప్రమాదంపై అనుమానాలున్నాయంటూ తెలిపారు. తమ కూతురుపై ఆమె స్నేహితులే అత్యాచారానికి పాల్పడ్డారని, ఆపై పథకం ప్రకారమే యాక్సిడెంట్‌ పేరుతో నాటకం ఆడుతున్నారని ఫిర్యాదులో వెల్లడించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు సెక్షన్‌ 49 కింద రేప్‌, మర్డర్‌ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.