వైజాగ్‌లో సినీ పరిశ్రమ నెలకొల్పాలి

‘‘సినిమా పరిశ్రమను నెలకొల్పడానికి అనుకూలమైన వాతావరణం ఉన్న నగరం వైజాగ్‌. నిర్మాతలు అల్లు అరవింద్, చినబాబుగార్లు విశాఖపట్నంలో ఫిల్మ్‌ ఇండస్ట్రీని నెలకొల్పడంలో ముందడుగు వెయ్యాలని కోరుతున్నా. అరవింద్‌గారు తన అదృష్టాన్ని విశాఖ నగరానికి కూడా అందించాలి’’ అన్నారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ చిత్రం గ్రాండ్‌ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ వైజాగ్‌లో జరిగాయి.


ఈ వేడుకలో అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ– ‘‘బాహుబలి’ తర్వాత బిగ్గెస్ట్‌ హిట్‌ సాధించిన చినబాబుగారు తన పేరును పెదబాబుగా మార్చుకోవాలి. మా గురువు, బావ అల్లు అరవింద్‌గారు బన్నీ (అల్లు అర్జున్‌) కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ ఇచ్చారు. మెగా ఫ్యాన్స్‌కు చిరంజీవిగారు దేవుడైతే, అరవింద్‌గారు క్షేత్ర పాలకుడు లాంటివారు. చిరంజీవిగారి ప్రయాణంలో అరవింద్‌గారి పాత్ర ఎంతో కొంత ఉంది. ఒక రైటర్‌ డైరెక్టర్‌ అయితే ఎలా ఉంటుందో ఇదివరకు దాసరి నారాయణరావుగారిని చూశాం.. ఇప్పుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌గారిని చూస్తున్నాం’’ అన్నారు.


అల్లు అరవింద్‌ మాట్లాడుతూ– ‘‘మా నాన్న అల్లు రామలింగయ్యగారిని తలుచుకొని మాట్లాడుతున్నా. సినిమా అనేది అందరికంటే గొప్పది. ఇప్పుడు 2020లోనే కాదు.. 2060లోనూ ‘అల.. వైకుంఠపురములో..’ పాటలు పాడతారని ఒట్టేసి చెబుతున్నాను.. ‘శంకరాభరణం’ చిత్రం పాటలను ఇప్పటికీ పాడుకుంటున్నారు. ఒక గొప్ప సినిమాకు గొప్ప సంగీతం తోడైతే అది వందేళ్లు నిలిచిపోతుంది.. అలాగే మా సినిమాని కూడా వందేళ్లు ఉంచుతారు. త్రివిక్రమ్‌ సెల్యులాయిడ్‌ తాంత్రికుడు. ప్రేక్షకులు లేకపోతే మేము లేము, ఈ సినిమా లేదు, ఈ పండగ లేదు’’ అన్నారు. ‘‘విలువలతో సినిమా తియ్యండి..  మేమెందుకు ఆదరించమో చూపిస్తామని మీరంతా చెప్పారు.. అది మాకే కాదు, తెలుగు సినిమాకే నమ్మకాన్నిచ్చింది. తెలుగు సినిమాని బన్నీ ఎక్కడికో తీసుకెళ్లగలడు’’ అన్నారు త్రివిక్రమ్‌.