డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పేరుతో టోకరా

బంజారాహిల్స్‌: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పీఏగా చెప్పుకుంటూ బీరాంగూడలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను ఇప్పిస్తానంటూ నమ్మించి రూ. లక్షలు  దండుకున్న జూబ్లీహిల్స్‌ డివిజన్‌ బీజేపీ మాజీ నాయకుడు ప్రదీప్‌పై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 2లోని జవహర్‌ కాలనీకి చెందిన ప్రదీప్‌ గతంలో బీజేపీ కార్యకర్తగా పని చేశాడు. బీహెచ్‌ఈఎల్‌ సమీపంలోని బీరాంగూడలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇప్పిస్తానంటూ పల్నాటి పూజారెడ్డి అనే మహిళ నుంచి రూ. 5 లక్షలు వసూలు చేసిన అతను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ పేరుతో నకిలీ పట్టాను అందజేశాడు. మంత్రుల కాన్వాయ్‌లో ఉపయోగించే సైరన్‌తో కూడిన వాహనంలో వీరిని బీరాంగూడకు తీసుకెళ్లి నిర్మాణంలో ఉన్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను చూపించాడు.


అనంతరం ఆమెతో పాటు మరికొందరి నుంచి రూ. 5 లక్షల చొప్పున వసూలు చేసిన ప్రదీప్‌ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి బోగస్‌ రబ్బర్‌ స్టాంప్‌లతో పూజారెడ్డి ఫొటోతో సహా పట్టా అందజేశాడు. అయితే రోజులు గడిచినా ఇళ్లు కేటాయించకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె  పలుమార్లు ప్రదీప్‌ను నిలదీయడంతో కొద్ది రోజులుగా అతను తప్పించుకు తిరుగుతున్నాడు. తనతో పాటు మరికొందరిని ఇదే తరహాలో మోసం చేసినట్లు గుర్తించిన బాధితురాలు ప్రదీప్‌పై చర్యలు తీసుకోలని కోరుతూ  బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా ప్రదీప్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 46లో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కేటాయిస్తానంటూ ఆరు నెలల క్రితం కూడా దాదాపు 25 మంది నుంచి రూ. 40 లక్షల  వసూలు చేసిన కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. బెయిల్‌పై బయటికి వచ్చిన అతను తన పంథా మార్చుకోకుండా  మోసాలకు పాల్పడుతున్నాడు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.