వికేంద్రీకరణకు కేబినెట్‌ ఆమోదం

రాష్ట్ర శాసనసభ సరికొత్త చరిత్రకు వేదికైంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను సోమవారం సభ ఆమోదించింది. అభివృద్ధి అన్నది ఒకే చోట కేంద్రీకృతం కారాదని.. అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాలకు సమానంగా విస్తరించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను సంపూర్ణంగా సమర్థించింది. అమరావతి ప్రాంతాన్ని కీలకమైన శాసన రాజధానిగా నిర్ణయించింది. ఇక సహజ వనరులతో సహజ సిద్ధంగా అభివృద్ధి చెందిన తీర ప్రాంత నగరం విశాఖపట్నం పరిపాలన రాజధానిగా, వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి తగిన ప్రాతినిధ్యం కల్పిస్తూ హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేసేందుకు ఆమోదించింది. తద్వారా మూడు కీలక వ్యవస్థలను రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో నెలకొల్పుతూ ప్రాంతీయ సమగ్రాభివృద్ధికి, రాష్ట్ర పురోభివృద్ధికి అడుగులు ముందుకు వేసింది. అమరావతిలో భూములు ఇచ్చిన రైతులు, రైతు కూలీలపై పలు వరాలు కురిపించడం ద్వారా తాను మనసున్న ముఖ్యమంత్రినని వైఎస్‌ జగన్‌ మరోమారు నిరూపించుకున్నారు.