సాక్షి, మచిలీపట్నం/చిలకలపూడి: మచిలీపట్నం కలెక్టరేట్‌లో భూసంస్కరణల విభాగం అధీకృత అధికారి(ఏఓ)గా పనిచేస్తున్న దాసరి ప్రశాంతి ఓ రైతు నుంచి రూ.3లక్షలు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీకి చిక్కారు. పట్టాదార్ పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ కోసం రూ.6లక్షలు డిమాండ్ చేసిన ప్రశాంతి.. తొలివిడతగా రూ.3లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ ఏఎస్పీ కేఎం మహేశ్వర రాజుతో పాటు బాధిత రైతు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లి మండలం ఉండవల్లికి చెందిన మోకా రామలింగేశ్వరరెడ్డి కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కాటూరు వద్ద 4.53 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. పసుపుకుంకుమ కింద వచ్చినట్టుగా కోర్టు నుంచి పొందిన ఆర్డర్ ఆధారంగా కృష్ణకుమారి అనే ఆమె నుంచి ఈ భూమిని కొనుగోలు చేసి 2.53 ఎకరాలు తన పేరిట, మరో ఎకరం తన తల్లి మోకా జయలక్ష్మి, ఇంకో ఎకరం భూమి తన సోదరి ఆళ్ల జానకీదేవి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
పట్టాదార్‌పాస్‌పుస్తకం, టైటిల్ డీడ్స్ కోసం 2016లో ఏ.కొండూరు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేయగా, ఆ భూమి ల్యాండ్ సీలింగ్‌లో ఉన్నట్టుగా స్థానిక అధికారులు చెప్పారు. దీంతో నూజివీడు ఆర్డీఓను ఆశ్రయించగా, అక్కడ నుంచి కలెక్టరేట్‌కు ఫైల్ చేరింది. అప్పట్లోనే ఈ పని నిమిత్తం రూ.5 లక్షలు ముట్టజెప్పిన రామలింగేశ్వర రెడ్డి 2017 నుంచి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం ఫైనల్ నోటీసులు జారీ చేస్తున్న సమయంలో ఏఓ ప్రశాంతి బాధిత రైతునకు సమాచారం పంపారు. మీ చేతికి పట్టాదార్ పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్స్ కావాలంటే కనీసం రూ.6లక్షలు ఖర్చవుతాయని అందుకు సిద్ధమైతే కలెక్టరేట్ రావాలని సూచించారు. దీనిపై రైతు రామలింగేశ్వరరావు తాను రూ.6 లక్షలు ఇవ్వలేనని స్పష్టం చేయడంతో.. ముందు మీ దగ్గర ఎంత ఉంటే అంత పట్టుకురండి మిగిలిన డబ్బుల సంగతి ఆ తర్వాత చూద్దామని సూచించారు. దీంతో ఆమె అడిగిన డబ్బులు ఇచ్చినా పని అవుతుందో లేదోనన్న ఆందోళనతో రామలింగేశ్వరారవు విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలియజేశారు.