సాక్షి, శృంగవరపుకోట: ప్రేమిస్తున్నానంటూ ఆరునెలలుగా వెంటపడి వేధిస్తున్న యువకుడిని కాదన్నందుకు ఉన్మాదిలా మారాడు. విద్యార్థిని ప్రాణం తీయాలని హత్యకు తెగబడ్డాడు. హత్యాయత్నం తర్వాత ఆమె చనిపోయి ఉంటుందన్న భయంతో రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. వేపాడ మండలం బొద్దాం గ్రామంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్.కోట పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ చదివిన జామి మండలం చింతాడ గ్రామానికి చెందిన విద్యార్థిని వేపాడ మండలం బొద్దాం గ్రామంలోని తన మేనమామ ఇంటిలో ఉంటోంది. ఆరునెలలుగా అదే గ్రామానికి చెందిన పందిరిపల్లి కోటేశ్వరరావు(21) ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడి వేధిస్తున్నాడు.
దీనికి విద్యార్థిని ప్రతిస్పందించకపోవడంతో కసితో రగిలిపోయాడు. ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. మధ్యాహ్నం విద్యార్థిని మేనమామ మేడ పక్కన ఉన్న మేడపై కాపుకాశాడు. భోజనం తర్వాత మేనమామ మేడ కిందికి వెళ్లిపోగా, అతని భార్య నీళ్లు తెచ్చుకోవటానికి మేడ దిగి వెళ్లడాన్ని గమనించిన కోటేశ్వరరావు ఒక్కసారిగా ఇంటిలోకి చొరబడ్డాడు. 3.15 గంటల సమయంలో విద్యార్థిని మెడపై కత్తితో దాడి చేశాడు. రెండోసారి దాడిచేయడంతో విద్యార్థిని చేతిని అడ్డుగా పెట్టింది. దీంతో ఆమె ఎడమచేయి తెగిపోయింది. రక్తపుమడుగులో పడిపోవడంతో ఉన్నాదిగా మారిన యువకుడు పరారయ్యాడు.