72 ఏళ్లు గడిచినా రాజధాని కూడా లేదు...

సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడు అనాలోచిత రాజకీయ నిర్ణయాల కారణంగానే ఆంధ్రరాష్ట్ర ప్రజలు రాజధాని లేకుండా మిగిలిపోయారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. దేశానికి స్వాతంత్ర్య వచ్చి 72 ఏళ్లు గడిచినా.. ఇంకా కరువు ప్రాంతంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఒక్క ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేసి మిగతా ప్రాంతాలపై కుట్రపూరింతగా వివక్ష చూపడం వల్లనే వెనుకబడి పోతున్నాయని అన్నారు. కేవలం వెనుకబాటు తనం కారణంగానే తెలంగాణ ఉద్యమం​ వచ్చిందని, విభజన అనంతరం హైదరాబాద్‌ నుంచి పారిపోయి రావడానికి చంద్రబాబు నాయుడే కారణమని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర నుంచి ఇప్పటికీ ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. సోమవారం శాసన సభలో వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి కన్నబాబు సుదీర్ఘ ప్రసంగం చేశారు.