మొత్తం నామినేషన్లు 25,768

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు జరగనున్న ఎన్నికల కోసం భారీసంఖ్యలో అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం వార్డులు, డివిజన్లు కలిపి 3,052 స్థానాలకు 25,768 నామినేషన్లు వచ్చాయని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. వాటిలో 432 నామినేషన్లు తిరస్కరణకు గురికాగా 25,336 నామినేషన్లు చెల్లుబాటయ్యాయని, 19,673 మంది బరిలో నిలిచారని ఆదివారం ఎస్‌ఈసీ ప్రకటించింది. 14న ఉపసంహరణ తర్వాత ఎంతమంది బరిలో ఉంటారనేది స్పష్టత రానుంది.


అధికంగా టీఆర్‌ఎస్‌ నుంచి
టీఆర్‌ఎస్‌ నుంచి అధికంగా 8,956మంది నామినేషన్లు దాఖలు చేశారు. తరువాత స్థానాల్లో కాంగ్రెస్‌(5,356 మంది), బీజేపీ (4,176 మంది) పార్టీ అభ్యర్థులు నిలిచారు. 4,889 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తుండటం గమనార్హం. ఇతర పార్టీలైన ఎంఐఎం (414 మంది), తెలుగుదేశం (433 మంది), సీపీఐ (269 మంది), సీపీఎం (268 మంది) నుంచి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.


అత్యధికంగా ఇక్కడే..
నిజామాబాద్‌ 1,062, రామగుండం 814, సూర్యాపేట 662, మహబూబ్‌నగర్‌ 608, నల్లగొండ 595, జగిత్యాల 457, సంగారెడ్డి 445, పెద్దపల్లి 413, ఆదిలాబాద్‌ 404, కొరుట్ల 353, మంచిర్యాల 398లలో అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి.