భారత్‌ ‘విజన్‌ 2020’ అట్టర్‌ ఫ్లాప్‌

సాక్షి, న్యూఢిల్లీ : 2020 సంవత్సరం నాటికల్లా వర్దమాన దేశమైన భారత్, అభివృద్ధి చెందిన దేశంగా మారడమే కాకుండా ప్రపంచంలో సూపర్‌ పవర్‌గా అవతరిస్తుందని ఎంతో మంది శాస్త్రవేత్తలు, ఆర్థిక వేత్తలు, రాజకీయ నిపుణలు ఆశించారు, అంచనాలు వేశారు. భారత మాజీ రాష్ట్రపతి, ఇస్రో మాజీ శాస్త్రవేత్త అబ్దుల్‌ కలామ్, తోటి ప్రభుత్వ శాస్త్రవేత్త వైఎస్‌ రాజన్‌తో కలసి ఏకంగా ‘భారత్‌ 2020’లో అంటూ ఓ పుస్తకమే రాశారు. 2020లో ఆర్థికంగా చైనాను అధిగమించి అమెరికానే సవాల్‌ చేస్తామని, అప్పుడు వచ్చే దీపావళిని దేశభక్తులుగా గొప్పగా జరుపుకోవచ్చని బీజేపీ నేత సుబ్రమణియం స్వామి వ్యాఖ్యానించారు. 2020 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే తన ప్రభుత్వ విధానమని 2002లో అప్పటి దేశ ప్రధాని అటల్‌ బిహారి వాజపేయి స్వాతంత్య దినోత్సవ సందేశంలో ప్రకటించారు.